2 సమూయేలు 23:1-7
Telugu Holy Bible: Easy-to-Read Version
దావీదు తుది పలుకులు
23 ఇవి దావీదు చివరి మాటలు,
“యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన రాజు,
ఇశ్రాయేలు మధుర గాయకుడు,
యెష్షయి కుమారుడు అయిన దావీదు పలికిన సందేశం.
దావీదు ఇలా అన్నాడు:
2 యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడినది.
ఆయన పలుకే నా నోటిలో వున్నది.
3 ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు,
ఇశ్రాయేలుకు, ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో యిలా అన్నాడు:
‘ఏ వ్యక్తి ప్రజలను న్యాయమార్గాన పరిపాలిస్తాడో,
ఏ వ్యక్తి దైవ భీతితో పరిపాలన సాగిస్తాడో
4 ఆ వ్యక్తి అరుణోదయ కాంతిలా ప్రకాశిస్తాడు,
ఆ వ్యక్తి మబ్బులేని ప్రాతఃకాలంలా ప్రశాంతంగా వుంటాడు,
లేతగడ్డిని చిగురింపజేయు వర్షానంతర సూర్యకాంతిలా
ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు.’
5 “గతంలో దేవుడు నా కుటుంబాన్ని బలపర్చలేదు.
తరువాత దేవుడు నాతో ఒక శాశ్వత ఒడంబడిక చేశాడు.
అది సమగ్రమైన నిబంధనగా దేవుడు రూపొందించాడు.
ఈ ఒడంబడికను దేవుడు బలపర్చాడు.
దానిని ఆయన ఉల్లంఘించడు!
ఈ ఒడంబడిక నాకు మోక్ష సాధనం; నేను కోరినదల్లా ఈ ఒడంబడికనే; ఖచ్చితంగా యెహోవా దానిని వర్ధిల్లేలాగు చేస్తాడు!
6 “కాని దుష్టులు ముండ్లవంటి వారు.
జనులు ముండ్లనుచేతబట్టరు.
వాటిని తక్షణం విసర్జిస్తారు!
7 వాటిని ఎవరు తాకినా కర్ర,
ఇనుము బల్లెములతో గుచ్చివేసినట్లవుతుంది.
దుష్టులు కూడ ముండ్ల వంటి
వారు వారు అగ్నిలో తోయబడి
పూర్తిగా దహింపబడతారు.”
© 1997 Bible League International