లూకా 9:51-18:14
Telugu Holy Bible: Easy-to-Read Version
విశ్వసించని గ్రామము
51 ఆయన పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడసాగింది. యేసు యెరూషలేము వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. 52 తన దూతల్ని తనకన్నా ముందు పంపాడు. వాళ్ళు ఆయన కోసం అన్నీ సిద్దం చెయ్యాలని ఒక సమరయ పల్లెకు వెళ్ళారు. 53 ఆ వూరి వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం వలన ఆయనకు స్వాగతమివ్వలేదు. 54 ఆయన శిష్యులలో యాకోబు, యోహాను యిది చూసి యేసుతో, “ప్రభూ! వాళ్ళను నాశనం చేయటానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటారా?” అని అడిగారు.
55 యేసు వాళ్ళవైపు చూసి వాళ్ళను గద్దించాడు.[a] 56 అక్కడి నుండి వాళ్ళంతా మరొక గ్రామానికి వెళ్ళారు.
యేసును వెంబడించటం
(మత్తయి 8:19-22)
57 వాళ్ళు దారిమీద నడుస్తుండగా ఒకడు యేసుతో, “మీరు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.
58 యేసు, “నక్కలు నివసించటానికి బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడా స్థలం లేదు” అని అన్నాడు.
59 యేసు యింకొకనితో, “నా వెంట రా!” అని అన్నాడు.
కాని అతడు, “ప్రభూ! నేను వెళ్ళి ముందు నా తండ్రిని సమాధి చేసి రానివ్వండి!” అని అన్నాడు.
60 యేసు అతనితో, “చనిపోయిన వాళ్ళ సంగతి చనిపోయినవాళ్ళు చూసుకోనీ. నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించు” అని అన్నాడు.
61 ఇంకొకడు, “ప్రభూ! నేను మిమ్మల్ని అనుసరిస్తాను. కాని ముందు వెళ్ళి నాయింటి వాళ్ళకు చెప్పి రానివ్వండి” అని అన్నాడు.
62 అందుకు యేసు, “దున్నుటకు నాగల్ని పట్టుకొని వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు” అని అతనితో చెప్పాడు.
యేసు తన డెబ్బది రెండు మంది శిష్యులను పంపటం
10 ఆ తర్వాత యేసు మరొక డెబ్బది రెండు[b] మంది శిష్యులను నియమించాడు. వాళ్ళను జతలు జతలుగా తాను వెళ్ళబోయే ప్రతి గ్రామానికి, పల్లెకు తన కంటే ముందు పంపుతూ, 2 “పంటబాగా పండింది. కాని పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. అందువల్ల పంటనిచ్చిన ఆ ప్రభువును పని వాళ్ళను తన పొలాలకు పంపమని ప్రార్థించండి.
3 “వెళ్ళండి! తోడేళ్ళ మందలోకి గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. 4 మీ వెంటడబ్బు దాచుకొనే సంచి కాని, జోలి కాని, చెప్పులు కాని, తీసుకు వెళ్ళకండి. దారి మీద ఎవ్వరితో మాట్లాడకండి. 5 ఒకరి యింట్లోకి వెళ్ళేముందు, మొదట సమాధానం కలుగుగాక అని చెప్పండి. 6 ఆ యింటిలో శాంతి పొందనర్హుడైన వ్యక్తి ఉంటే మీ ఆశీస్సు అతనికి తోడౌతుంది. లేని పక్షంలో మీ ఆశీస్సు మీకు తిరిగివస్తుంది. 7 ఉన్న యింట్లోనే ఉండండి. ఇచ్చిన దాన్ని భుజించండి. పని చేసినవానికి కూలి దొరకాలి కదా! ఇల్లిల్లు తిరగకండి.
8 “ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగతమిచ్చి ఏది మీ ముందు పెడితే అది భుజించండి. 9 గ్రామంలో ఉన్న రోగులకు నయం చెయ్యండి. వాళ్ళతో, ‘దేవుని రాజ్యం మీ దగ్గరకు వస్తోంది’ అని చెప్పండి.
10 “మీరొక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగత మివ్వకుంటే 11 వీధిలోకి వెళ్ళి మీరు చేస్తున్నది తప్పని సూచించటానికి, ‘మా కాలికంటిన మీ ఊరి ధూళి కూడా దులిపి వేస్తున్నాము. కాని యిది మాత్రం నిజం. దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది. తెలిసికోండి’ అని అనండి. 12 తీర్పు చెప్పబోయేరోజున, ఆ ఊరి ప్రజల్ని దేవుడు సొదొమ ప్రజలకన్నా ఎక్కువగా శిక్షిస్తాడని నేను చెబుతున్నాను.
యేసు విశ్వసించనివారిని హెచ్చరించటం
(మత్తయి 11:20-24)
13 “అయ్యో కొరాజీనా! అయ్యో బేత్సయిదా! మీకోసం చేసిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాలలో చేసివుంటే వాళ్ళు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకొని బూడిద తలపై వేసుకొని పశ్చాత్తాపం చెంది, మారుమనస్సు పొందివుండే వాళ్ళు. 14 కాని తీర్పు చెప్పబడే రోజున తూరు, సీదోను ప్రజలకన్నా మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాడు. 15 ఇక, ఓ కపెర్నహూమా! ఆకాశ మంత ఎత్తుగా హెచ్చించుకొందువా? పాతాళానికి త్రోసి వేయబడతావు.
16 “మీ బోధనలు వింటే నా బోధనలు విన్నట్టే. మిమ్మల్ని నిరాకరిస్తే నన్నును నిరాకరించినట్టే. నన్ను నిరాకరిస్తే నన్ను పంపినవానిని నిరాకరించినట్లే” అని వాళ్ళతో అన్నాడు.
సాతాను పడిపోవటం
17 ఆ డెబ్బది రెండు మంది శిష్యులు ఆనందంతో తిరిగి వచ్చి, “ప్రభూ! మీ పేరు చెప్పగానే దయ్యాలు కూడా మా మాటలకు లోబడ్డాయి” అని అన్నారు.
18 యేసు, “సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడిపోవటం నేను చూశాను. 19 పాముల మీద నడవటానికి మీకు అధికారము యిచ్చాను. శత్రువును జయించే అధికారం యిచ్చాను. ఏది మీకు హాని చెయ్యలేదు. 20 దయ్యాలు మీ మాట వింటున్నంత మాత్రాన ఆనందించకండి. మీ పేరు పరలోకంలో వ్రాయబడినందుకు ఆనందించండి” అని అన్నాడు.
యేసు తండ్రిని ప్రార్థించటం
(మత్తయి 11:25-27; 13:16-17)
21 ఆయన పవిత్రాత్మలో సంతోషిస్తూ, “ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి ఓ తండ్రి! నీకు స్తుతులు! నీవీ విషయాలు చదువుకున్న వాళ్ళనుండి, విజ్ఞానుల నుండి దాచి, అమాయకులకు తెలియ చేసావు. ఔను, తండ్రీ! ఇదే నీచిత్తము.
22 “నా తండ్రి నాకు అన్నీ యిచ్చాడు. తండ్రికి తప్ప కుమారుడెవరో ఇతర్లకు తెలియదు. కుమారుడు చెప్పదలచిన వాళ్లకు తప్ప తండ్రి ఎవరో యితర్లకు తెలియదు” అని అన్నాడు.
23 ఆ తర్వాత తన శిష్యుల వైపు తిరిగి, “మీరు చూస్తున్నవి చూసే కన్నులు ధన్యమైనవి. 24 నేను చెప్పేదేమిటంటే మీరు చూస్తున్నవి చూడాలని చాలా మంది ప్రవక్తలు, రాజులు ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని వాళ్ళాశించారు. కాని వినలేక పోయారు” అని రహస్యంగా వారితో అన్నాడు.
మంచి సమరయుని ఉపమానం
25 ఒక ధర్మశాస్త్ర పండితుడు యేసును పరీక్షించాలనుకొని లేచి, “బోధకుడా! నేను నిత్యజీవం[c] పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
26 దానికి యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసారు? నీవు ఏమిచదివావు?” అని అడిగాడు.
27 అతడు, “‘నీ ప్రభువైనటువంటి దేవుణ్ణి సంపూర్ణమైన మనస్సుతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితోనూ, శక్తితోనూ ప్రేమించు.’ అంతేకాక, ‘నిన్ను ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాళ్ళను ప్రేమించు’ అని వ్రాయబడివుంది” అని చెప్పాడు.
28 యేసు ఈ విధంగా అన్నాడు: “నీవు సరియైన సమాధానం చెప్పావు. ఆ విధంగా నడుచుకో, అనంత జీవితం పొందుతావు.”
29 ఆ పండితుడు తాను నీతిమంతుడనని రుజువు చేయటానికి యేసుతో, “మరి నా పొరుగువాడు ఎవరు?” అని అడిగాడు.
30 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ దార్లో దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళతణ్ణి నిలువు దోపిడి చేసి బాగాకొట్టి వదిలి వేసారు. అతడు కొన ప్రాణంతో ఉన్నాడు.
31 “అనుకోకుండా ఒక యాజకుడు ఆ దారిన రావటం తటస్థించింది. అతణ్ణి చూసి కూడా ఆ యాజకుడు ప్రక్కకు తొలిగి వెళ్ళిపొయ్యాడు. 32 అదే విధంగా ఒక లేవీయుడు కూడా వచ్చి అతణ్ణి చూసి ప్రక్కకు తొలిగి వెళ్ళి పొయ్యాడు.
33 “ఒక సమరయ ప్రాంతపువాడు ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూసి ఆ సమరయ వానికి చాలా జాలి కలిగింది. 34 అతని దగ్గరకు వెళ్ళి అతని గాయాలమీద ద్రాక్షారసం పోసి, నూనె రాచి, కట్లుకట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద అతణ్ణి ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకు వెళ్ళాడు. ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు. 35 మరుసటి రోజు ఆ సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బు నీకిస్తాను’ అని చెప్పి వెళ్ళి పొయ్యాడు.”
36 ఈ విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో చిక్కిన వానికి ఈ ముగ్గరిలో ఎవరు పొరుగువాడని నీ అభిప్రాయం?” అని అడిగాడు.
37 ఆ పండితుడు, “అతనిపై జాలి చూపిన వాడే!” అని సమాధానం చెప్పాడు.
దానికి యేసు, “నీవు కూడా అతనిలాగే నడుచుకో” అని చెప్పాడు.
యేసు మార్త యింటికి వెళ్ళటం
38 యేసు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో మార్త అనే స్త్రీ ఆయన్ని తన యింటికి ఆహ్వానించింది. 39 ఆమెకు మరియ అనే ఒక సోదరి ఉంది. మరియ యేసు ప్రభువు కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పిన విషయాలు వింటూ ఉంది. 40 కాని మార్తకు పని ఎక్కువగా ఉండటం వల్ల చిరాకు కలిగింది. ఆమె యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరి యింటి పనులంతా నామీద వదిలి వేయటం మీకు న్యాయమనిపిస్తుందా? వచ్చి నాకు సహాయం చెయ్యమని ఆమెతో చెప్పండి” అని అన్నది.
41 ప్రభువు, “మార్తా! మార్తా! పనులు ఎక్కువగా ఉండటంవల్ల నీకు చింత, చిరాకు కలుగుతున్నాయి. 42 నిజంగా చెయ్యవలసింది ఒక్కటే పని. మరియ ఏది ఉత్తమమో దాన్ని ఎన్నుకొంది. దాన్ని ఆమెనుండి ఎవ్వరూ తీసుకోలేరు” అని అన్నాడు.
యేసు ప్రార్థన గురించి బోధించటం
(మత్తయి 6:9-15)
11 ఒక రోజు యేసు ఒక చోట ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థించటం ముగించాక ఆయన శిష్యుల్లో ఒకడు, “ప్రభూ! యోహాను తన శిష్యులకు ప్రార్థించటం నేర్పించినట్లు మాక్కూడా ప్రార్థించటం నేర్పండి” అని అడిగాడు.
2 ఆయన వాళ్ళతో, “మీరు ఈ విధంగా ప్రార్థించాలి:
‘తండ్రీ! నీ పేరు పవిత్రంగానే ఉండాలి!
నీ రాజ్యం రావాలి!
3 మాకు ప్రతి రోజు ఆహారం యివ్వు!
4 మా పట్ల పాపం చేసిన వాళ్ళను మేము క్షమించినట్లు
మా పాపాలు క్షమించు.
మమ్మల్ని శోధనలో పడనివ్వవద్దు!’”
నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము
(మత్తయి 7:7-11)
5-6 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “ఒక వేళ మీలో ఒకడు అర్ధరాత్రివేళ తన స్నేహితుని యింటికి వెళ్ళి, ‘నా స్నేహితుడు ఒకడు అకస్మాత్తుగా మా యింటికొచ్చాడు. మా యింట్లో తినటానికి ఏమి లేదు. మూడు రొట్టెలుంటే యిస్తావా?’ అని అడిగాడనుకొండి. 7 ఆ స్నేహితుడు యింటి నుండి బయటకు రాకుండా, ‘నేను, నా పిల్లలు పడుకున్నాం. తలుపులు కూడా తాళం వేసాం. అనవసరంగా బాధ పెట్టొద్దు. అయినా యిప్పుడు లేచి నేను రొట్టెలివ్వలేను’ అని అన్నాడనుకోండి. నేను చెప్పేదేమిటంటే, 8 అతడు తన స్నేహితుడైనందుకు రొట్టెలు యివ్వకపోయినా మొండిగా అడగటం వల్ల తప్పక లేచి అతడడిగిన రొట్టెలు యిస్తాడు. 9 కనుక, నేను మీకు చెప్పేదేమంటే; అడగండి, మీకు లభిస్తుంది. వెతకండి దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకోసం తెరుచుకుంటుంది. 10 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన వానికి దొరుకుతుంది. తలుపు తడితే అది అతని కోసం తెరుచుకుంటుంది. 11 మీలో ఏ తండ్రి తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా పామునిస్తాడు? 12 లేక గ్రుడ్డునడిగితే తేలునిస్తాడు? 13 మీరు చెడ్డవాళ్లైనా మీ కుమారులకు మంచి బహుమతులు ఎట్లా యివ్వాలో మీకు తెలుసు. కనుక పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగినవాళ్ళకు పవిత్రాత్మను తప్పక యిస్తాడని గ్రహించండి” అని చెప్పాడు.
యేసుని శక్తి దేవునినుండి వచ్చినది
(మత్తయి 12:22-30; మార్కు 3:20-27)
14 ఒక రోజు యేసు ఒక మూగ దయ్యాన్ని పారద్రోలుతూ ఉన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోగానే అది పట్టిన మనిషి మాట్లాడటం మొదలు పెట్టాడు. అది చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. 15 కొందరు, “బయెల్జెబూలు అనే దయ్యాలరాజు ద్వారా అతడు దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.
16 మరి కొందరు యేసును పరీక్షించుచూ ఒక అద్భుతం పరలోకం నుండి చూపుమని అడిగారు. 17 యేసుకు వాళ్ళ అభిప్రాయం తెలిసిపోయింది. అందువల్ల వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “చీలికలు కలిగిన యిల్లు పడిపోతుంది. 18 సైతానురాజ్యంలో చీలికలు కలిగితే వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? ఇలా ఎందుకు అంటున్నానంటే బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాల్ని వదిలిస్తున్నానని మీరు అంటున్నారు. 19 నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాల్ని వదిలిస్తున్నట్లైతే, మీ వాళ్ళు దేని సహయంతో దయ్యాల్ని వదిలిస్తున్నారు? అందువల్ల మీ వాదన తప్పని మీ వాళ్ళే రుజువు చేస్తున్నారు. 20 కాని నేను దైవశక్తితో దయ్యాల్ని వదిలిస్తున్నాను కనుక, దేవుని రాజ్యం వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తొంది.
21 “ఒక బలవంతుడు ఆయుధాల్ని ధరించి తన యింటిని కాపలా కాస్తే అతని యింట్లోని వస్తువులు భధ్రంగా ఉంటాయి. 22 కాని అతని కన్నా బలవంతుడు వచ్చి మీదపడి అతన్ని ఓడిస్తే అతడిన్నాళ్ళు నమ్ముకున్న ఆయుధాలన్నీ ఇంటివానియొద్ద నుండి తీసుకొని, ఆదోచుకొన్న వస్తువుల్ని అందరికి పంచి పెడ్తాడు.
23 “నాతో ఉండని వాడు నాకు వ్యతిరేకంగా ఉన్న వానితో సమానము. నాతో కలిసి గొఱ్ఱెల్ని ప్రోగుచేయటానికి సహాయం చెయ్యనివాడు వాటిని చెదరగొట్టిన వానితో సమానము.
శూన్యమై ఉండుట అపాయము
(మత్తయి 12:43-45)
24 “దయ్యము ఒక మనిషి నుండి వెలుపలికి వచ్చాక విశ్రాంతి కోసం నీరులేని స్థలాల్లో వెతుకుతుంది. కాని దానికి విశ్రాంతి లభించదు. అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన యింటికి వెళ్తాను’ అని అనుకుంటుంది. 25 అక్కడికి వెళ్ళాక ఆ యిల్లు ఊడ్చబడి వుండటం ఎక్కడి వస్తువులక్కడ సక్రమంగా వుండటం చూస్తుంది. 26 అది మళ్ళీ బయటికి వెళ్ళి తనకన్నా దుర్మార్గులైన ఏడు దయ్యాలను తనవెంట తీసుకువస్తుంది. ఆ దయ్యాలన్నీ కలిసి ఆ యింట్లో నివసించటానికి వెళ్తాయి. అప్పుడు ఆ మనిషి స్థితి మొదటిస్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది.”
దేవుడు దీవించు జనులు
27 యేసు ఈ విషయాలు చెబుతుండగా ప్రజల్లో ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను కని, పెంచిన ఆ తల్లి ధన్యురాలు” అని అన్నది.
28 ఆయన, “అవునుగాని, దైవసందేశం విని దాన్ని పాటించే వాళ్ళు ఇంకా ధన్యులు” అని సమాధానం చెప్పాడు.
కొందరు యేసు అధికారాన్ని సందేహించటం
(మత్తయి 12:38-42; మార్కు 8:12)
29 ప్రజల గుంపు పెరుగుతూ పోయింది. యేసు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఈ కాలం వాళ్ళు చెడ్డవాళ్ళు, గనుక అద్భుతాలు అడుగుతారు. దేవుడు యోనాను పంపి యిచ్చిన రుజువు తప్ప, మరే రుజువు మీకు యివ్వబడదు. 30 ఎందుకంటే, నీనెవె ప్రజలకు యోనా ఏ విధంగా ఒక రుజువో అదే విధంగా మనుష్యకుమారుడు ఈ తరం వాళ్ళకు ఒక రుజువు.
31 “దక్షిణ దేశపు రాణి సొలొమోను రాజు బోధిస్తున్న జ్ఞానాన్ని వినటానికి చాలా దురం నుండి వచ్చింది. కాని యిప్పుడు సొలోమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. ఈనాటి ప్రజలు ఆయన మాటలు వినటం లేదు. కనుక తీర్పు చెప్పబడే రోజు ఆ రాణి వీళ్ళతో సహా నిలబడి వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తుంది.
32 “నీనెవె ప్రజలు యోనా బోధనలు విని మారుమానస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజున వాళ్ళు ఈనాటి ప్రజలతో సహా నిలుచొని వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తారు. కాని యిప్పుడు యోనా కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు.
దేహం యొక్క వెలుగు
(మత్తయి 5:15; 6:22-23)
33 “దీపాన్ని వెలిగించి, యింటికి వచ్చే పోయే వాళ్ళకు కనిపించేలా ఒక ఎత్తైన బల్ల మీద పెడ్తాము కాని, గంప క్రింద దాచి ఉంచము. 34 మీ కళ్ళు దేహానికి దీపం లాంటివి. మీ కళ్ళు బాగుంటే మీ దేహమంతా కాంతితో వెలుగుతుంది. కాని, అవి చెడిపోతే, మీ దేహమంతా చీకటైపోతుంది. 35 అందువలన మీలో ఉన్న వెలుగు చీకటైపోకుండా చూసుకొండి. 36 మీ దేహమంతా కొంచెం కూడా చీకటిలో లేకుండా వెలుగుతూ ఉంటే అది సంపూర్ణంగా వెలుగుతూ ఉంటుంది. ఆ దేహం దీపపు వెలుగు ప్రకాశించినట్లు ప్రకాశిస్తుంది.”
యేసు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని విమర్శించటం
(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; లూకా 20:45-47)
37 యేసు మాట్లాడటం ముగించాడు. ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి ఆహ్వానించాడు. యేసు అతని యింటికి వెళ్ళి భోజనానికి కూర్చుని ఉన్నాడు. 38 యేసు భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవటం గమనించి పరిసయ్యునికి ఆశ్చర్యం వేసింది. 39 అప్పుడు ప్రభువు అతనితో, “మీ పరిసయ్యులు గిన్నెల్ని, పళ్ళేల్ని వెలుపలి భాగం శుభ్రం చేస్తారు. కాని లోపల దురాశ, దుష్టత్వము నిండివుంటాయి. 40 మూర్ఖులారా! వెలుపలి భాగం సృష్టించిన వాడే లోపలి భాగం సృష్టించలేదా? 41 మీరు దాచుకున్న వాటిని పేదవాళ్ళకు దానం చెయ్యండి. అప్పుడు మీరు పూర్తిగా శుభ్రమౌతారు.
42 “మీరు మీ తోటలో పండిన పుదీనా, సదాప మొదలగు కూరగాయల యొక్క పదవవంతు దేవునికి యిస్తారు. కాని న్యాయాన్ని, దేవుని ప్రేమని నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక మీకు శ్రమ. పదవవంతు ఇవ్వటం మానుకోకుండా న్యాయాన్ని, దేవుని ప్రేమను కూడా అలవరచుకోవలసింది.
43 “మీరు సమాజ మందిరాల్లో ఉన్నత స్థలాల్లో కూర్చోవటానికోసం ప్రాకులాడుతారు. దారి మీద వెళ్తూవుంటే ప్రజలు గౌరవమివ్వాలని ఆశిస్తారు. కనుక మీకు శ్రమ తప్పదు. 44 ప్రజలు తమకు తెలియకుండా త్రొక్కుతూ నడిచే సమాధుల్లాంటి వాళ్ళు మీరు. మీకు శ్రమ తప్పదు” అని అన్నాడు.
45 ధర్మశాస్త్రంలో పాండిత్యం ఉన్న ఒకడు లేచి, “బోధకుడా! మీరీ విధంగా మాట్లాడి మమ్మల్ని కూడా అవమానిస్తున్నారు” అని అన్నాడు.
46 యేసు, “ధర్మశాస్త్ర పండితులారా! మీరు ప్రజలపై వాళ్ళు మోయలేని భారం వేస్తున్నారు. కాని వాటిని లేపటానికి మీరు ఒక్క వ్రేలు కూడా కదల్చరు. కనుక మీకు శ్రమ తప్పదు. 47 మీరు ప్రవక్తల కోసం సమాధులు కట్టిస్తారు. కాని మీ పూర్వికులు వాళ్ళను చంపారు. కనుక మీకు శిక్ష తప్పదు. 48 అంటే పూర్వికులు చేసిన దాన్ని అంగీకరిస్తున్నట్లు నిరూపించుకొంటున్నారన్న మాట. వాళ్ళు ప్రవక్తల్ని చంపారు. మీరు సమాధులు కట్టించారు. 49 అందువల్లే దేవుడు దివ్యజ్ఞానంతో ఈ విధంగా చెప్పాడు: ‘నేను వాళ్ళకోసం ప్రవక్తల్ని, అపొస్తలులను పంపుతాను. కొందర్ని వాళ్ళు చంపుతారు. మిగతా వాళ్ళను హింసిస్తారు.’
50 “అందువలన ప్రపంచం పుట్టిన నాటినుండి ప్రవక్తలు కార్చిన రక్తానికి ఈ తరం వాళ్ళు బాధ్యులు. 51 హేబెలు హత్య మొదలుకొని ధూప వేదికకు, మందిరానికి మధ్య చంపబడిన జెకర్యా హత్యదాకా వీళ్ళు బాధ్యులు. ఔను. ఈ కాలం వాళ్ళు వీటికి బాధ్యులని నేను చెబుతున్నాను.
52 “ధర్మశాస్త్ర పండితులారా! జ్ఞానం యొక్క తాళం చెవి మీరు తీసుకున్నారు. దాని తలుపులు తెరిచి మీరు లోనికి వెళ్ళలేరు. పైగా వెళ్తున్న వాళ్ళను అడ్డగిస్తారు. మీకు శిక్ష తప్పదు” అని చెప్పాడు.
53 యేసు అక్కడినుండి వెళ్ళిన తర్వాత పరిసయ్యులును, శాస్త్రులును ఆయనను ఇంకా ఎక్కువగా వ్యతిరేకించారు. ప్రశ్నలతో ఆయన్ని వేధించారు. 54 ఆయనను మాటలలో చిక్కించాలని ప్రయత్నించారు.
పరిసయ్యులవలె ఉండవద్దు
12 అంతలో వేలమంది ప్రజలు సమావేశమవటం వలన ఒకళ్ళనొకళ్ళు త్రోసు కోవటం మొదలు పెట్టారు. యేసు మొదట తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: “పరిసయ్యుల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తపడండి. 2 బయట పడకుండా ఏదీ దాగివుండదు. దాచబడింది ఏదీ బహిరంగం కాకుండా పోదు. 3 చీకట్లో మాట్లాడుకున్న మాటలు అందరికీ వినిపిస్తాయి. గది తలుపులు వేసుకొని రహస్యంగా మాట్లాడుకున్న విషయాలు ఇంటి కప్పుల మీదినుండి ప్రకటింపబడతాయి.
దేవునికి మాత్రమే భయపడుము
(మత్తయి 10:28-31)
4 “మిత్రులారా! నేను చెబుతున్నది వినండి: ఈ శరీరాన్ని చంపేవాళ్ళను చూసి భయపడకండి. దాన్ని చంపాక వాళ్ళేమీ చెయ్యలేరు. 5 ఎవరికి భయపడాలో నేను చెబుతున్నాను. శరీరం చనిపోయాక మిమ్మల్ని నరకంలో పారవేయటానికి అధికారమున్న వానికి భయపడండి! ఔను, ఆయనకు భయపడుమని చెబుతున్నాను.
6 “రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్ముడు పోతాయి కదా! అయినా, ఒక్క పిచ్చుకనైనా దేవుడు మరచిపోలేదు. 7 మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు. పిచ్చుకలకన్నా మీ విలువ ఎక్కువే! కనుక భయపడకండి.
నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవొద్దు
(మత్తయి 10:32-33; 12:32; 10:19-20)
8 “బహిరంగంగా నన్ను అంగీకరించిన వాణ్ణి మనుష్యకుమారుడు దేవదూతల సమక్షంలో అంగీకరిస్తాడని నేను చెబుతున్నాను. 9 కాని ప్రజల సమక్షంలో నన్ను కాదన్న వాణ్ణి మనుష్యకుమారుడు దేవుని సమక్షంలో కాదంటాడు.
10 “మనుష్యకుమారుణ్ణి దూషించిన వాణ్ణి దేవుడు క్షమించవచ్చునేమో కాని పవిత్రాత్మను దూషించినవాణ్ణి దేవుడు క్షమించడు.
11 “సమాజమందిరాల ముందు, లేక పాలకుల ముందు, లేక అధికారుల ముందు మిమ్మల్ని నిలబెడితే ఏ విధంగా మాట్లాడాలో, నిర్దోషులని ఏ విధంగా ఋజువు చేసుకోవాలో చింతించకండి. 12 మీరు ఏమి మాట్లాడాలో అప్పుడు పవిత్రాత్మ మీకు చెబుతాడు.”
పిసినారి ఉపమానం
13 ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు.
14 యేసు, “నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు?” అన్నాడు. 15 ఆ తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని యేసు అన్నాడు.
16 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగాపంట పండింది. 17 అతడు ‘నేనేం చేయాలి? నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే’ అని తన మనస్సులో ఆలోచించసాగాడు.
18 “‘ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను’ అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు, తనతో 19 ‘అదృష్టవంతుడివి, సంవత్సరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, ఆనందించు’ అని చెప్పుకుంటానని అనుకొన్నాడు.
20 “కాని దేవుడు అతనితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి ఎవరు అనుభవిస్తారు?’ అని అడిగాడు.
21 “ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా ఉంటుంది.”
మొదట దేవుని రాజ్యం
(మత్తయి 6:25-34, 19-21)
22 ఈ విధంగా చెప్పి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “అందువల్ల నేను చెప్పేదేమిటంటే జీవించటానికి ఏమి తినాలి? మీ దేహాలకు ఏ దుస్తులు ధరించాలి? అని చింతించకండి. 23 మీ జీవితం ఆహారాని కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువైనది. 24 పక్షుల్ని చూడండి. అవి విత్తనాలు నాటవు. పంటకోయవు. వాటిదగ్గర ఎలాంటి ధాన్యపు కొట్లు లేవు. దేవుడు వాటికి ఆహారం చూపిస్తున్నాడు. మీరాపక్షుల కన్నా విలువైన వాళ్ళు. 25 చింతించి తన జీవితాన్ని ఒక గంట పొడిగించగల వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? 26 మీరింత చిన్న విషయం సాధించ లేనప్పుడు మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తున్నారు?
27 “పువ్వులు ఏ విధంగా పెరుగుతున్నాయో గమనించండి. అవి పని చేయవు. దారం వడకవు. నేను చెప్పేదేమిటంటే ఖరీదైన దుస్తులు వేసుకొనే సొలొమోను రాజుకూడా ఏ ఒక్క పువ్వుతో సరితూగలేడు. 28 మీలో కొంతకూడా విశ్వాసం లేదు. ఎందుకు? ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో కాలిపోయే గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించాడు కదా! మరి మిమ్మల్నెంత అందంగా అలంకరిస్తాడో ఆలోచించండి.
29 “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి. 30 ప్రపంచం లోవున్న ప్రతి ఒక్కడూ వాటికోసం ప్రాకులాడుతాడు. మీ తండ్రికి మీకేవి అవసరమో తెలుసు. 31 ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మీకు యివి కూడా యిస్తాడు.
ధనమును నమ్ముకొనవద్దు
32 “మీరు అమాయకమైన చిన్న మందలాంటి వాళ్ళు. కాని భయపడకండి. మీ తండ్రి తన రాజ్యాన్ని మీకు ఆనందంగా ఇస్తాడు. 33 మీ ఆస్థి అమ్మి పేదవాళ్ళకు దానం చెయ్యండి. పాతబడని డబ్బుల సంచి సిద్దం చేసుకోండి. మీ ధనాన్ని పరలోకంలో దాచండి. అక్కడ అది తరగదు. దొంగలు దాన్ని ముట్టలేరు. ఆ సంపదకు చెదలు పట్టవు. 34 మీ ధనమున్న చోటే మీ మనస్సు కూడా ఉంటుంది.
సిద్దంగా ఉండండి
(మత్తయి 24:42-44)
35 “మీ నడికట్టుతో నడుముకు చుట్టి, దీపాలు వెలిగించి సిద్దంగా ఉండండి. 36 పెళ్ళి విందుకు వెళ్ళి యింటికి వస్తున్న యజమాని కోసం కాచుకొని ఉండే సేవకుల్లా ఉండండి. అలా చేస్తే యజమాని వచ్చి తలుపు తట్టిన వెంటనే అతనికోసం మీరు తలుపు తీయకలుగుతారు. 37 యజమాని వచ్చినప్పుడు మెలుకువతో ఉన్న సేవకులు ధన్యులు. ఇది నిజం. యజమాని వచ్చి తానే నడుము బిగించుకొని స్వయంగా సేవ చేస్తాడు. సేవకుల్ని కూర్చోబెట్టి వాళ్ళకు వడ్డించటానికి సిద్ధమౌతాడు. 38 అతడు ఏ అర్థరాత్రికో లేక తెల్లవారుఝామునో వచ్చినప్పుడు అతని కోసం సిద్దంగావున్న సేవకులు ధన్యులు. వాళ్ళకు శుభం కలుగుతుంది.
39 “కాని యిది అర్థంచేసుకోండి. దొంగ ఏ ఘడియలో వస్తాడో యింటి యజమానికి తెలిస్తే అతడు తన యింట్లోకి దొంగల్ని రానివ్వడు. 40 మీరు కూడా సిద్ధంగా వుండండి. ఎందుకంటే మనుష్య కుమారుడు మీరు అనుకోని సమయంలో వస్తాడు.”
నమ్మదగిన సేవకుడు ఎవరు
(మత్తయి 24:45-51)
41 పేతురు, “ప్రభూ! మీరీ ఉపమానం మాకోసం చెబుతున్నారా లేక అందరి కోసమా?” అని అడిగాడు.
42 ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “తెలివిగల ఉత్తమ సేవకుడు ఎవడు? ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు తాను విశ్వసించగల వాణ్ణి, తెలివి గలవాణ్ణి తన యితర సేవకులకు సరియైన ఆహారం ఇవ్వటానికి వాళ్ళపై అధికారిగా నియమిస్తాడు. 43 ఆ యజమాని వచ్చినప్పుడు, అతడు చెప్పిన విధంగా నడుచుకొన్న సేవకుడు ధన్యుడు. 44 ఇది నిజం. ఆ యజమాని అతణ్ణి తన ఆస్థికంతటికి అధికారిగా నియమిస్తాడు.
45 “కాని ఒకవేళ ఆ సేవకుడు తనలో తాను, ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని తన క్రింద పనిచేసేవాళ్ళను ఆడా మగా అనే భేదం లేకుండా కొట్టి, తిని త్రాగటం మొదలు పెడతాడనుకోండి. 46 యజమాని ఆ సేవకుడు ఎదురుచూడని రోజున అనుకోని సమయంలో వచ్చి ఆ సేవకుణ్ణి నరికించి భక్తిహీనుల గుంపులో చేరుస్తాడు.
47 “తన యజమాని మనస్సు తెలిసి కూడా, అతని యిష్టానుసారం పని చెయ్యని సేవకుడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. 48 కాని తెలియక శిక్షార్హమైన పనులు చేసిన వాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి. దేవుడు తాను ఎక్కువగా యిచ్చిన వాళ్ళనుండి ఎక్కువ కోరుతాడు. ఎక్కువ అప్పగించినవాళ్ళ నుండి యిచ్చిన దానికన్నా ఎక్కువ ఆశిస్తాడు.
యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును
(మత్తయి 10:34-36)
49 “నేను ఈ భూమ్మీద అగ్ని వేయడానికి వచ్చాను. ఆ అగ్ని యిదివరకే రగిలి ఉండాలని ఆశించాను. 50 కాని నేను పొందవలసిన బాప్తిస్మము ఉంది. అది జరిగే వరకు నాకీ వేదన తప్పదు. 51 శాంతిని కలుగ జేయుటకు నేనీ భూమ్మీదికి వచ్చాననుకొంటున్నారా? కాదు. దీన్ని విభజించటానికి వచ్చాను. 52 ఇప్పటి నుండి ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే, వాళ్ళు విడిపోయి, ముగ్గురు ఒకవైపుంటే ఇద్దరొకవైపు: యిద్దరొక వైపుంటే ముగ్గురొక వైపు చేరి పోట్లాడుతారు.
53 తండ్రి కుమారునితో,
కుమారుడు తండ్రితో,
తల్లి కూతురుతో,
కూతురు తల్లితో,
అత్త కోడలితో,
కోడలు అత్తతో పోట్లాడుతారు.”
కాలాన్ని అర్థం చేసుకోండి
(మత్తయి 16:2-3)
54 యేసు అక్కడున్న ప్రజలతో, “మీరు పడమరన మేఘాలు కమ్ముకోవటం చూసిన వెంటనే, ‘వర్షం కురుస్తుంది’ అని అంటారు. 55 దక్షిణం నుండి గాలివీయగానే, ‘వేడి ఎక్కువౌతుంది’ అని అంటారు. మీరన్నట్లే జరుగుతుంది. 56 కాని మీరు వంచకులు. భూమివైపు, ఆకాశం వైపు చూసి ఏమి జరుగబోతుందో చెప్పగలరు. కాని ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చూసి ఏమి జరుగబోతుందో ఎందుకు చెప్పలేరు?
నీ సమస్యలను తీర్చుకొనుము
(మత్తయి 5:25-26)
57 “ఏది న్యాయమో స్వయంగా మీరే నిర్ణయించండి. 58 మీ ప్రతి వాదితో కలిసి న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళటానికి ముందు దారి మీద ఉన్నప్పుడే అతనితో రాజీ పడటానికి గట్టిగా ప్రయత్నించండి. అలా చెయ్యకపోతే అతడు మిమ్మల్ని న్యాయధిపతి ముందుకు లాగవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటులకు అప్పగించవచ్చు. ఆ భటులు మిమ్మల్ని కారాగారంలో వేయవచ్చు. 59 నేను చెప్పేది వినండి. మీ దగ్గర ఉన్న చివరి పైసా చెల్లించే దాకా మీరు బయటపడరు.”
పాపాలు చెయ్యటం మానుకోండి
13 ఆ సమయంలో అక్కడున్న వాళ్ళలో కొందరు యేసుతో, “పిలాతు గలిలయ ప్రజల రక్తాన్ని బలి యిచ్చిన జంతువుల రక్తంతో కలిపాడని” చెప్పారు. 2 యేసు వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ విధంగా చనిపోయినందుకు వీళ్ళు యితర గలిలయ ప్రజలకంటే ఎక్కువ పాపం చేసారని మీ అభిప్రాయమా? 3 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి. 4 గోపురం మీదపడి సిలోయములో చనిపోయిన ఆ పద్దెనిమిది మంది సంగతేమిటి? యెరూషలేములో నివసించే ఇతర ప్రజలకు కాకుండా వీళ్ళకు ఈ గతి పట్టటం సమంజసమని మీ అభిప్రాయమా? 5 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి.”
పండ్లుకాయని అంజూరపు చెట్టు యొక్క ఉపమానం
6 ఆ తర్వాత యేసు ఈ ఉపమానం చెప్పాడు: “ఒకడు తన ద్రాక్షాతోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. పండ్లు కోసం ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళి అతడు తరచు చూస్తూవుండేవాడు. కాని అతనికి పండ్లు కనిపించలేదు. 7 అతడు తోటమాలితో, ‘ఈ చెట్టుకు పండ్లు కాస్తాయేమోనని మూడేళ్ళు చూసాను. కాని దానికి పండ్లు కాయలేదు. దాన్ని కొట్టేయి. అది అనవసరంగా భూమి సారాన్ని గుంజి వేస్తోంది’ అని అన్నాడు. 8 ఆ తోట మాలి, ‘అయ్యా! దీన్ని యింకొక సంవత్సరం వదిలెయ్యండి. నేను చుట్టూ పాదు త్రవ్వి ఎరువు వేస్తాను. 9 వచ్చే సంవత్సరం పంట కాస్తే, మంచిదే. కాయకపోతే అప్పుడు కొట్టి వేయవచ్చు’ అని అన్నాడు.”
యేసు విశ్రాంతిరోజున ఒక స్త్రీని నయం చేయటం
10 ఒక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. 11 దయ్యం పట్టటంవల్ల పద్దెనిమిది ఏళ్ళనుండి రోగంతో బాధపడ్తున్న స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగి ఉంది. ఆమె చక్కగా నిలువలేకపోయేది. 12 యేసు ఆమెను చూసి దగ్గరకు రమ్మని పిలిచి ఆమెతో, “అమ్మా! నీ రోగం నుండి నీకు విముక్తి కలిగించాను.” 13 అని అంటూ ఆమె మీద తన చేతుల్ని ఉంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టింది.
14 విశ్రాంతి తీసుకోవలసిన రోజున ఆమెకు నయం చేసినందుకు ఆ సమాజమందిరపు అధికారికి కోపం వచ్చింది. అతడు ప్రజలతో, “ఆరు రోజులు పని చెయ్యటానికి ఉన్నాయి. ఆ రోజుల్లో వచ్చి నయం చేయించుకోండి. విశ్రాంతి తీసుకోవలసిన రోజున కాదు” అని అన్నాడు.
15 యేసు, “మీరు కపటులు. విశ్రాంతి రోజు మీ ఎద్దును, గాడిదను కొట్టం నుండి విప్పుకొని వెళ్ళి నీళ్ళు త్రాగించరా? 16 ఈమె అభ్రాహాము కుమార్తె. పద్దెనిమిది సంవత్సరాలు సైతాను ఈమెను తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. మరి ఈమెకు విశ్రాంతి రోజు ఆ బంధంనుండి విముక్తి కలిగించనవసరం లేదంటారా?” అని అడిగాడు. 17 ఈ మాటలు, ఆయన విరోధులు సిగ్గుపడేటట్లు చేశాయి. కాని ఆయన చేసిన మహత్కార్యాల్ని చూసి ప్రజలు చాలా ఆనందించారు.
దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?
(మత్తయి 13:31-33; మార్కు 4:30-32)
18 ఆ తర్వాత యేసు, “దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చాలి? 19 అది ఒక ఆవగింజ లాంటిది. దాన్ని ఒకడు తన తోటలో నాటాడు. అది పెరిగి చెట్టయింది. ఆకాశంలో ఎగిరే పక్షులు దాని కొమ్మల మీద వ్రాలాయి” అని అన్నాడు.
20 యేసు మళ్ళీ, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చాలి?” అని అడిగి, 21 “అది పిండిలో కలిపే పులుపు లాంటిది. ఒక స్త్రీ ఆ పులుపును మూడు కుంచాల పిండిలో ఆ పిండంతా పులిసేదాకా కలిపింది” అని సమాధానం చెప్పాడు.
ఇరుకు ద్వారం
(మత్తయి 7:13-14, 21-23)
22 యేసు పట్టణాల్లో, పల్లెల్లో బోధిస్తూ యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. 23 ఒకడు, “ప్రభూ! కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు.
ఆయన వాళ్ళతో, 24 “దేవుని రాజ్యానికి ఉన్న ద్వారం యిరుకైనది. ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి గట్టి ప్రయత్నం చేయండి అనేకులు ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారు. కాని ప్రవేశించలేరు. 25 ఇంటి యజమాని లేచి తలుపులకు తాళం వేస్తాడు. మీరు బయట నిలబడి తలుపు తడుతూ ‘అయ్యా! మాకోసం తలుపు తెరవండి!’ అని వేడుకొంటారు. కాని ఆయన ‘మీరెవరో, ఏ ఊరినుండి వచ్చారో నాకు తెలియదు’ అని సమాధానం చెబుతాడు. 26 అప్పుడు మీరు, ‘మీతో కలిసి తిన్నాము. మీరు మా వీధుల్లో బోధించారు’ అని అంటారు. 27 కాని ఆయన, ‘మీరెవరో నాకు తెలియదు. ఎక్కడినుండి వచ్చారో తెలియదు. ఇక్కడినుండి వెళ్ళండి, మీరంతా దుర్మార్గులు’ అని అంటాడు.
28 “మీరు అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును ఇతర ప్రవక్తలను దేవుని రాజ్యంలో చూస్తారు. మిమ్మల్ని బయట పారవేసినందుకు మీరు దుఃఖిస్తారు. బాధననుభవిస్తారు. 29 ప్రజలు ఉత్తర దక్షిణాల నుండి, తూర్పు పడమరల నుండి దేవుని రాజ్యంలో జరుగుతున్న విందుకు వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. 30 ఇప్పుడు చివరి స్థానాల్లో కూర్చున్నవాళ్ళు అక్కడ ముందు స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు మొదటి స్థానాల్లో ఉన్న వాళ్ళు అక్కడ చివరి స్థానాల్లో కూర్చుంటారు” అని అన్నాడు.
యేసు యెరూషలేము విషయంలో దుఃఖించటం
(మత్తయి 23:37-39)
31 అప్పుడు కొందరు పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, “ఈ ప్రాంతం వదిలి యింకెక్కడికైనా వెళ్ళు. హేరోదు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు” అని అన్నారు.
32 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ రోజు, రేపు ప్రజలకు నయం చేస్తాను. దయ్యాల్ని వదిలిస్తాను. మూడవరోజు నేను చేయవలసిన కార్యం ముగిస్తుంది. వెళ్ళి ఈ విషయం ఆ గుంట నక్కతో చెప్పండి. 33 ప్రవక్త అయినవాడు యెరూషలేమునకు బయట మరణించకూడదు కదా. కనుక ఏది ఏమైనా ఈ రోజు, రేపు, ఎల్లుండి నా ప్రయాణం సాగిస్తూ ఉండవలసిందే.
34 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తలను చంపుతున్నావు. దేవుడు పంపిన ప్రచారకుల్ని రాళ్ళతో కొడుతున్నావు. కోడి తన పిల్లల్ని రక్షించటానికి రెక్కల క్రిందికి చేర్చుకొన్నట్లే నీ ప్రజలను నాదగ్గరకు చేర్చుకోవాలని ఎన్నో సార్లు అనిపించింది! కాని నీవు దానికి అంగీకరించలేదు! 35 నీ ఇల్లు పాడుబడుతుంది. ‘ప్రభువు పేరిట వచ్చినవాడు ధన్యుడు’ అని నీవనేవరకు నీవు నన్ను చూడవు.”
యేసు ఒక రోగికి నయం చెయ్యటం
14 ఒక విశ్రాంతి రోజు యేసు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వాళ్ళు ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. 2 దేహమంతా నీరొచ్చిన[d] ఒక వ్యక్తి యేసు ముందు కొచ్చాడు. 3 యేసు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం శాస్త్ర సమ్మతమా? కాదా?” అని అడిగాడు. 4 వాళ్ళు దానికి సమాధానం చెప్పలేదు. యేసు ఆ రోగి మీద తన చేతులుంచి నయం చేసి పంపాడు. 5 ఆ తర్వాత, “మీ కుమారుడో లేక మీ ఎద్దు విశ్రాంతి రోజు బావిలో పడితే మీరు వెంటనే పైకి లాగి రక్షించరా?” అని అడిగాడు. 6 దానికి వాళ్ళు సమాధానం చెప్పలేక పోయారు.
నిన్ను నీవు గొప్ప చేసికొనవద్దు
7 విందులకు వచ్చిన అతిథులు గౌరవ స్థానం ఆక్రమించుట గమనించి యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: 8 “మీరు పెళ్ళి విందుకు ఆహ్వానింపబడినప్పుడు, మీకన్నా ముఖ్యమైన అతిథులు ఆహ్వానించబడి ఉండవచ్చు. కనుక ముందు స్థానాల్లో కూర్చోకండి. 9 అలాచేస్తే ఆ యింకొక వ్యక్తిని ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘ఈ స్థలం యితనికి యివ్వు’ అని అంటాడు. నీవు అవమానం పొంది చివరన ఉన్న స్థలంలో కూర్చోవలసి వస్తుంది.
10 “అందువల్ల నిన్ను ఆహ్వానించినప్పుడు చివరన ఉన్న స్థలంలో కూర్చో. అలా చేస్తే నిన్ను ఆహ్వానించిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ‘మిత్రమా! ముందుకు వచ్చి మంచి స్థలంలో కూర్చో’ అని అంటాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళలో నీ గౌరవం పెరుగుతుంది. 11 ఎందుకంటే ఉన్నత స్థానాన్ని ఆక్రమించినవాడు అల్ప స్థానానికి దించబడతాడు. తనంతట తాను అల్ప స్థానాన్ని ఆక్రమించినవాడు ఉన్నత స్థానానికి ఎత్తబడతాడు.”
నీకు ప్రతిఫలము దొరుకుతుంది
12 అప్పుడు యేసు తన అతిథితో, “భోజనానికి లేక విందుకు ఆహ్వానించదలచినప్పుడు మీ స్నేహితుల్ని కాని, మీ సోదరుల్ని కాని, మీ బంధువుల్ని కాని ధనికులైన మీ ఇరుగు పొరుగు వాళ్ళను కాని ఆహ్వానించకండి. అలా చేస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. అప్పుడు వాళ్ళ రుణం తీరిపోతుంది. 13 కనుక మీరు విందు చేసినప్పుడు పేదవాళ్ళను, వికలాంగులను, కుంటివాళ్ళను, గ్రుడ్డివాళ్ళను ఆహ్వానించండి. 14 వాళ్ళు మీ రుణం తీర్చలేరు. కనుక మీరు ధన్యులౌతారు. ఎందుకంటే మంచి వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు దేవుడు మీరు చేసిన మంచి పనికి మంచి బహుమతి నిస్తాడు” అని అన్నాడు.
పెద్ద విందు ఉపమానం
(మత్తయి 22:1-10)
15 భోజనానికి కూర్చున్న వాళ్ళలో ఒకడు యిది విని యేసుతో, “దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొన్నవాడు ధన్యుడు” అని అన్నాడు.
16 యేసు యిలా చెప్పాడు: “ఒకడు పెద్ద విందు చేయదలచి చాలా మందిని ఆహ్వానించాడు. 17 వంటలు సిద్ధమయ్యాక తాను ఆహ్వానించిన వాళ్ళ దగ్గరకు తన సేవకుణ్ణి పంపి ‘రండి! అంతా సిద్ధం’ అని చెప్పమన్నాడు. 18 కాని అందరూ ఒకే రీతిగా సాకులు చెప్పారు. మొదటివాడు ‘నేను పొలం కొన్నాను, వెళ్ళి తప్పకుండా దాన్ని చూడాలి; నన్ను క్షమించు’ అని అన్నాడు. 19 ఇంకొకడు ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను. వెళ్ళి అవి ఏ విధంగా పనిచేస్తాయో చూడాలి, నన్ను క్షమించుము’ అని అన్నాడు. 20 మరొకడు ‘నేను ఈ రోజే పెళ్ళి చేసుకున్నాను కనుక రాలేను’ అని అన్నాడు.
21 “ఆ సేవకుడు తిరిగి వచ్చి జరిగినదంతా తన యజమానితో చెప్పాడు. అతనికి కోపం వచ్చి తన సేవకునితో, ‘వెంటనే పట్టణంలో ఉన్న అన్ని వీధుల్లోకి వెళ్ళి పేదవాళ్ళను, వికలాంగులను, గ్రుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను పిలిచుకురా!’ అని అన్నాడు.
22 “ఆ సేవకుడు మళ్ళీవచ్చి, ‘అయ్యా! మీరు చెప్పినట్లు చేసాను. కాని భోజనశాలలు ఇంకా నిండలేదు’ అని అన్నాడు. 23 అప్పుడు ఆ యజమాని తన సేవకునితో ‘ఊరి బయటనున్న రహదారులకు, పొలాలకు వెళ్ళి అక్కడి వాళ్ళను తప్పక రమ్మనమని చెప్పు. వాళ్ళతో నా యిల్లంతా నిండి పోవాలి. 24 నేను చెప్పేదేమిటంటే నేనిదివరకు పిలిచిన వాళ్ళలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’ అని అన్నాడు.”
నన్ను వెంబడించగలవేమో తీర్మానించుకొనుము
(మత్తయి 10:37-38)
25 ప్రజలు గుంపులు గుంపులుగా యేసుతో ప్రయాణం చేస్తూవున్నారు. యేసు వాళ్ళ వైపు తిరిగి, 26 “నాతో వచ్చి, తన తల్లి తండ్రులకన్నా, తన భార్యకన్నా, తన సంతానానికన్నా, తన తోబుట్టువులకన్నా, చివరకు తన ప్రాణానికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించలేనివాడు నా శిష్యుడు కాలేడు. 27 అంతేకాక తన సిలువను మోసికొని నన్ను అనుసరించనివాడు నా శిష్యుడు కాలేడు.
28 “గోపురం కట్టాలనుకొన్నవాడు కూర్చొని దానికి ఎంత వ్యయమౌతుందో అంచనా వేయడా? తన దగ్గర కావలసినంత డబ్బు ఉందో లేదో చూసుకోడా? 29-30 పునాదులు వేసాక దాన్ని పూర్తి చెయ్యలేక పోతే చూసిన వాళ్ళంతా ‘ఇతడు కట్టటం మొదలెట్టాడు కాని పూర్తి చెయ్యలేక పోయాడు’ అని అతణ్ణి హేళన చేస్తారు.
31 “అంతేకాక ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చెయ్యటానికి వెళ్తాడనుకోండి. అతడు శాంతంగా కూర్చొని తన పదివేల సైన్యంతో యుద్దం చేయబోతున్న ఇరవై వేల సైన్యాన్ని ఎదిరించగలనా లేదా అని ఆలోచించడా? 32 యుద్ధం చేయలేనని అనుకుంటే సైన్యాలు దూరంగా ఉన్నప్పుడే తన రాయబారుల్ని పంపి సంధి చేసుకొంటాడు.
33 “అదే విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు.
నీ గోప్పతనమును పోగొట్టుకొనవద్దు
(మత్తయి 5:13; మార్కు 9:50)
34 “ఉప్పు మంచిదే, కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే దాన్ని మళ్ళీ ఉప్పుగా ఎట్లా చెయ్యగలము? 35 అది పెంట కుప్పుకు పనికి రాదు. పొలానికి పనికి రాదు. దాన్ని పారవేయవలసి వస్తుంది.
“చెప్పిన వాటిని జాగ్రత్తగా గమనించండి” అని అన్నాడు.
తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానం
(మత్తయి 18:12-14)
15 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు. 2 కాని పరిసయ్యులు, శాస్త్రులు, “ఇతడు పాపుల్ని పిలిచి వాళ్ళతో కలిసి తింటాడు” అని గొణిగారు.
3 అప్పుడు యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: 4 “మీలో ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే అతడు తన తొంబది తొమ్మిది గొఱ్ఱెల్ని అక్కడ బయల్లో వదిలేసి ఆ తప్పిపోయిన గొఱ్ఱె దొరికేదాకా వెతకడా? 5 అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో 6 యింటికి వెళ్ళి తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, ‘తప్పిపోయిన నా గొఱ్ఱె దొరికింది. మనమంతా ఆనందించుదాం’ అని అంటాడు. 7 నేను చెప్పేదేమిటంటే అదేవిధంగా మారుమనస్సు పొందనవసరం లేని తొంభైతొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగె ఆనందంకన్నా పాపం చేసిన ఒక్కడు మారుమనస్సు పొందితే పరలోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు.
8 “ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణాలు ఉన్నాయనుకోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి యిల్లంతా వూడ్చి అది దొరికే దాకా జాగ్రత్తగా వెతకదా? 9 దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి పోగొట్టుకున్న నా నాణెం దొరికింది. మనమంతా ఆనందించుదాం! అని అంటుంది. 10 నేను చెప్పేదేమిటంటే అదే విధంగా ఒక పాపాత్ముడు మారుమనస్సు పొందితే దేవదూతలు ఆనందిస్తారు” అని అన్నాడు.
తప్పిపోయిన కుమారుని ఉపమానం
11 యేసు ఇంకా ఇలా చెబుతూ పోయాడు: “ఒకనికి యిద్దరు కుమారులు ఉన్నారు. 12 చిన్నవాడు తండ్రితో, ‘నాన్నా! నా భాగం ఆస్తి నాకు ఇచ్చేయి’ అని అడిగాడు. తండ్రి సరేనని తన ఆస్తిని ఇరువురి మధ్య పంచిపెట్టాడు.
13 “కొద్ది రోజుల్లో చిన్నవాడు తనపాలు భాగం తీసుకొని దూర దేశాలకు వెళ్ళి పొయ్యాడు. ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు పెట్టాడు. 14 అంతా ఖర్చయి పోయింది. ఇంతలో అతడున్న దేశంలో తీవ్రమైన క్షామం వచ్చింది. అతని దగ్గర ఏమీ మిగల్లేదు. కనుక ఆ దేశంలో ఉన్న ఒక ఆసామి దగ్గర ఉద్యోగంలో చేరాడు. 15 ఆ ఆసామి అతణ్ణి పందులు కాయటానికి నియమించాడు. 16 ఆ పందులు తీనే ఆహారంతో తన కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. ఆయినా ఎవ్వరూ అతనికి ఏదీ ఇవ్వలేదు.
17 “అతనికి బుద్ధి వచ్చింది. అతడు ‘నా తండ్రి పనివాళ్ళ దగ్గర కూడా కావలసినంత తిండి ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. 18 నేను ఈ గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తాను. వెళ్లి అతనితో నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల కూడా పాపం చేశాను. 19 నేను నీ కుమారుడనని చెప్పుకొంటానికి కూడా తగను. నన్ను కూడా నీ దగ్గర పని చేసేవాళ్ళతో ఉండనీ!’ అని చెప్పాలని మనస్సులో అనుకున్నాడు. 20 వెంటనే అతడు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు.
చిన్న కుమారుడు తిరిగి రావటం
“ఇంటికి కొంత దూరంలో ఉండగానే అతని తండ్రికి తనకుమారుణ్ణి చూసి చాలా కనికరం కలిగింది. అతడు పరుగెత్తుకొంటూ తన కుమారుని దగ్గరకు వెళ్ళి అతణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. 21 అతడు తండ్రితో, ‘నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల పాపం చేసాను. నేను నీ కుమారుణ్ణని చెప్పుకోవటానికి కూడా తగను’ అని అన్నాడు.
22 “అతని తండ్రి పని వాళ్ళతో, ‘వెంటనే వెళ్ళి మంచి దుస్తులు, వేలికి ఉంగరము, కాళ్లకు జోళ్ళు తెచ్చి యితనికి తొడిగించండి. 23 బాగా బలిసిన దూడను తీసుకు వచ్చి కొయ్యండి. పండుగ చేసుకొందాం. 24 చనిపోయిన నా కుమారుడు బ్రతికి వచ్చాడు. తప్పి పోయినవాడు తిరిగి దొరికాడు’ అని అన్నాడు. వాళ్ళు వెంటనే పండుగ చేసుకోవడం మొదలు పెట్టారు.
పెద్ద కుమారుడు దోషారోపణ చేయటం
25 “ఇంతలో పెద్దవాడు పొలంనుండి ఇంటికి వస్తూవున్నాడు. ఆతనికి ఇంటినుండి సంగీతము, నాట్యము జరుగుతున్న ధ్వనులు వినిపించాయి. 26 అతడు పని వాళ్ళలో ఒకణ్ణి పిలిచి, ‘ఏమి జరుగుతోంది?’ అని అడిగాడు. 27 ఆ పనివాడు ‘మీ తమ్ముడు వచ్చాడు. మీ నాన్న అతడు క్షేమంగా తిరిగి వచ్చాడని బాగా బలిసిన దూడను కోసి విందు చేస్తున్నాడు’ అని చెప్పాడు.
28 “ఇది విని అతనికి కోపం వచ్చింది. కనుక ఇంట్లొకి అడుగు పెట్టనని అన్నాడు. అందువల్ల అతని తండ్రి వెలుపలికి వచ్చి బ్రతిమిలాడాడు. 29 అతడు తండ్రితో, ‘యిదిగో నాన్నా! ఎన్నో ఏండ్లనుండి నేను బానిసలాగా పనిచేసాను. నీ ఆజ్ఞ జవదాట లేదు. ఆయినా నేను నా స్నేహితులతో విందు చేసుకోవటానికి నీవు ఒక్క చిన్న గొఱ్ఱెను కూడా ఇవ్వలేదు. 30 కాని, నీ ఈ కుమారుడు ఆస్థినంతా వేశ్యలకు తగలెట్టి ఇల్లు చేరుకొంటే వానికోసం బలిసిన దూడను కోస్తున్నావు!’ అని అన్నాడు.
31 “కాని తండ్రి అతనితో, ‘నా బాబూ! నీవెప్పుడూ నా దగ్గరే ఉంటున్నావు. కనుక నా దగ్గర ఉన్నవన్నీ నీవి. 32 కాని నీ ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. తప్పిపోయిన వాడు దొరికాడు. కనుక మనం ఆనందంగా పండుగ చేసుకోవాలి’ అని అన్నాడు.”
అవినీతి గుమాస్తా యొక్క ఉపమానం
16 యేసు తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఒక ధనవంతుని దగ్గర ఒక గుమాస్తా పని చేస్తూ ఉండేవాడు. కొందరు, గుమాస్తా ఆ ధనవంతుని ధనం వ్యర్థం చేస్తున్నాడని అతనిపై ఆ ధనవంతునితో ఫిర్యాదు చేశారు. 2 ఆ కారణంగా ఆ ధనవంతుడు తన గుమాస్తాను పిలిచి, ‘నేను నిన్ను గురించి వింటున్నదేమిటి? జమాఖర్చుల లెక్కలు నాకు చూపు. నీవిక నా గుమాస్తాగా ఉండటానికి వీల్లేదు’ అని అన్నాడు.
3 “ఆ గుమాస్తా, ‘నేనేం చెయ్యాలి? నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసివేస్తున్నాడు. పొలం దున్ని జీవించాలంటే శక్తి లేదు. భిక్ష మెత్తుకోవాలంటే సిగ్గేస్తుంది. 4 ఆ! నా ఉద్యోగం పోయినప్పుడు ప్రజలు నన్ను తమ ఇండ్లలోనికి ఆహ్వానించేటట్లు ఏమి చెయ్యాలో తెలిసింది’ అని అనుకున్నాడు.
5 “వెంటనే అతడు తన యజమానికి అప్పున్న వాళ్ళను ఒక్కొక్కరిని పిలిచాడు. మొదటివానితో, ‘నా యజమానికి ఎంత అప్పున్నావు?’ అని అడిగాడు. 6 ‘వందలీటరులు ఒలీవ నూనె’ అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమాస్తా, ‘ఈ రసీదు తీసుకొని అక్కడ కూర్చొని దాన్ని వెంటనే యాభై లీటర్లు చెయ్యి’ అని అతనితో అన్నాడు.
7 “ఆ తర్వాత రెండవ వానితో, ‘నీవెంత అప్పున్నావు?’ అని అడిగాడు. ‘వంద గోధుమ సంచులు’ అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమాస్తా, ‘ఈ రసీదు తీసుకొని దాన్ని ఎనభై సంచులు చెయ్యి’ అని అతనితో అన్నాడు.
8 “ఆ యజమాని, ఆ అవినీతి గుమాస్తాను తెలివిగా ప్రవర్తించినందుకు అభినందించాడు. దైవ చింతన కలవాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చూపుతున్న తెలివి కన్నా, ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాళ్ళు తమ పరిస్థితుల్ని ఎక్కువ తెలివిగా ఎదుర్కొంటారు.
9 “నేను చెప్పేదేమిటంటే, మీ ఐహిక సంపదను ఉపయోగించి ఈ లోకపు స్నేహితులను సంపాదించండి. మీ ధనం తరిగిపోయిన తర్వాత వారు మీకు సహాయం అవుతారు. 10 చిన్న విషయాల్లో నమ్మగలిగిన వాణ్ణి పెద్ద విషయాల్లో కూడా నమ్మవచ్చు. చిన్న విషయాల్లో అవినీతిగా ఉన్నవాడు పెద్ద విషయాల్లో కూడా అవినీతిగా ఉంటాడు. 11 ఐహిక సంపద విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు నిజమైన సంపద విషయంలో మిమ్మల్నెవరు నమ్ముతారు? 12 ఇతరుల ఆస్థి విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు మీకు మీ స్వంత ఆస్థిని ఎవరిస్తారు?
13 “ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలాచేస్తే అతడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తాడు. ఒకని పట్ల విశ్వాసం చూపి యింకొకని పట్ల నీచంగా ప్రవర్తిస్తాడు. దేవుణ్ణి, ధనాన్ని సమంగా కొలువలేము.”
ధర్మశాస్త్రము, దేవుని రాజ్యము
(మత్తయి 11:12-13)
14 పరిసయ్యులు ధనాన్ని ప్రేమించేవాళ్ళు కనుక వాళ్ళు ఇది విని యేసును హేళన చేశారు. 15 యేసు వాళ్ళతో, “మీరు ప్రజల ముందు నీతిమంతులుగా ప్రవర్తిస్తారు. కాని మీ హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసు. మానవులు వేటికి అత్యధికమైన విలువనిస్తారో వాటిని దేవుడు తిరస్కరిస్తాడు.
16 “యోహాను కాలాందాకా ధర్మశాస్త్రము, ప్రవక్తలు వ్రాసిన విషయాలు ఆచరణలో ఉన్నాయి. యోహాను కాలం నుండి దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటింపబడుతోంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలోకి వెళ్ళాలని తమ శక్త్యానుసారం కష్టపడుతున్నారు. 17 భూమి, ఆకాశము నశించిపోవచ్చు, కాని ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు.
విడాకులు మరియు పునర్వివాహము
18 “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్న ప్రతివాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడాకులివ్వబడిన స్త్రీని వివాహం చేసుకొన్నవాడు కూడా వ్యభిచారిగా పరిగణింపబడతాడు” అని అన్నాడు.
ధనవంతుడు, లాజరు
19 “ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు మంచి విలువైన దుస్తులు వేసుకొని ప్రతిరోజు భోగాలనుభవిస్తూ జీవించేవాడు. 20 అతని గడప ముందు లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు ఉండేవి. కుక్కులు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి. 21 అతడాధనికుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు.
22 “ఆ భిక్షగాడు చనిపొయ్యాడు. అతణ్ణి దేవదూతలు తీసుకువెళ్ళి అబ్రాహాము ప్రక్కన కూర్చుండబెట్టారు. ఆ తర్వాత ఆ ధనికుడు కూడా చనిపొయ్యాడు. అతడు సమాధి చెయ్యబడ్డాడు. 23 నరకంలో ఆ ధనికుడు హింసలు అనుభవిస్తూవుండేవాడు. తలెత్తి చూడగా లాజరును తన ప్రక్కన కూర్చోబెట్టుకున్న అబ్రాహాము కనిపించాడు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. 24 అందువల్ల అబ్రాహామును పిలిచి, ‘తండ్రి అబ్రాహామా! నామీద దయ చూపు. నేను ఈ మంటల్లో తీవ్రంగా బాధపడ్తున్నాను. లాజరుతో ఇక్కడకు వచ్చి తన వేలుముంచి నా నాలుక తడపమని చెప్పండి’ అని అన్నాడు.
25 “కాని అబ్రాహాము, ‘కుమారుడా! జ్ఞాపకం తెచ్చుకో! నీవు బ్రతికిన రోజుల్లో సుఖాలనుభవించావు. లాజరు కష్టాలనుభవించాడు. కాని అతడిక్కడ ఆనందంగా ఉన్నాడు. నీవు బాధలను అనుభవిస్తున్నావు. 26 ఇక్కడి వాళ్ళు అక్కడకు రాకూడదని, అక్కడివాళ్ళు యిక్కడికి రాకూడదని మన మధ్య పెద్ద అఘాతం ఉంది’ అని అన్నాడు.
27 “ఆ ధనికుడు అలాగైతే ‘తండ్రి! లాజరును మా తండ్రి ఇంటికి పంపు. 28 అక్కడ నా ఐదుగురు సోదరులున్నారు. వాళ్ళు యిక్కడకు వచ్చి హింసలు అనుభవించకుండా ఉండేటట్లు వాళ్ళకు బోధించుమని చెప్పు’ అని అన్నాడు.
29 “అబ్రాహాము ఈ విధంగా సమాధానం చెప్పాడు: ‘మోషే, ప్రవక్తలు ఉన్నారు కదా! వాళ్ళు చెప్పినట్లు చెయ్యనీ!’
30 “‘తండ్రీ అబ్రాహామా! చనిపోయిన వాళ్ళనుండి ఎవరైనా వెళ్తే వాళ్ళు విని మారుమనస్సు పొందుతారు’ అని ఆ ధనికుడు అన్నాడు.
31 “అబ్రాహాము, ‘వాళ్ళు మోషే, ప్రవక్తలు చెప్పినట్లు విననట్లైతే చనిపోయినవాడు బ్రతికి వచ్చినా వాళ్ళు వినరు’ అని అన్నాడు.”
పాపము మరియు క్షమాపణ
(మత్తయి 18:6-7, 21-22; మార్కు 9:42)
17 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ప్రజలు పాపం చేసే పరిస్థితులు కలుగచేసే వాళ్ళకు శిక్ష తప్పదు. 2 ఈ అమాయకుల్లో ఏ ఒక్కడు పాపం చేసేటట్లు చేసినా శిక్ష తప్పదు. అది జరుగక ముందే అలాంటి వాని మెడకు తిరగటి రాయి కట్టి సముద్రంలో పడవేస్తే అది అతనికి మేలు చేసినట్లవుతుంది. 3 అందువల్ల జాగ్రత్త!
“మీ సోదరుడు పాపం చేస్తే గద్దించండి. పశ్చాత్తాపం చెందితే క్షమించండి. 4 అతడు రోజుకు ఏడుసార్లు మీ పట్ల పాపం చేసి ఏడుసార్లు మీ దగ్గరకు వచ్చి, ‘నేను పశ్చాత్తాపం చెందాను’ అని అంటే అతణ్ణి క్షమించండి.”
నీ విశ్వాసము ఎంత గొప్పది
5 అపొస్తలులు ప్రభువుతో, “మా విశ్వాసాన్ని గట్టి పరచండి” అని అన్నారు.
6 ప్రభువు అన్నాడు: “మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నాచాలు; మీరు కంబళి చెట్టుతో, ‘నీవు నీ వేర్లతో బాటు పెళ్లగింపబడి వెళ్ళి సముద్రంలో పడి అక్కడ నాటుకుపో!’ అని అంటే అది మీ మాట వింటుంది.
సేవకుని కర్తవ్యం
7 “మీ పొలం దున్నే సేవకుడో లేక మీ గొఱ్ఱెలు కాచే సేవకుడో ఒకడున్నాడనుకోండి. అతడు పొలం నుండి యింటికి రాగానే, ‘రా! వచ్చి కూర్చొని భోజనం చెయ్యి’ అని అతనితో అంటారా? అనరు. 8 దీనికి మారుగా, ‘వంటవండి, దుస్తులు మార్చుకొని, నేను తిని త్రాగేదాకా పనిచేస్తూవుండు. ఆ తర్వాత నువ్వు కూడా తిని త్రాగు’ అని అంటారు. 9 మీరు చెప్పినట్లు విన్నందుకు మీ సేవకునికి కృతజ్ఞత తెలుపుకుంటారా? 10 మీరు కూడా చెప్పిన విధంగా చేసాక ‘మేము మామూలు సేవకులము, చెప్పినట్లు చేసాము. అది మా కర్తవ్యం’ అని అనాలి.”
పదిమంది కుష్టురోగులకు నయం చెయ్యటం
11 యేసు యెరూషలేముకు ప్రయాణం సాగిస్తూ గలిలయ నుండి సమరయ పొలిమేరలకు వచ్చాడు. 12 ఒక గ్రామంలోకి వెళ్తూండగా పదిమంది కుష్టురోగులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆయనకు కొద్ది దూరంలో నిలుచొని, 13 “యేసు ప్రభూ! మాపై దయచూపు” అని బిగ్గరగా అన్నారు.
14 ఆయన వాళ్ళను చూసి, “వెళ్ళి యాజకులకు చూపండి” అని అన్నాడు.
వాళ్ళు వెళ్తూంటే వాళ్ళకు నయమైపోయింది. 15 వాళ్ళలో ఒకడు తనకు నయమవటం గమనించి, గొంతెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ వెనక్కు వెళ్ళాడు. 16 యేసు ముందు మోకరిల్లి కృతజ్ఞత చెప్పుకున్నాడు. అతడు సమరయ వాడు. 17 యేసు, “పది మందికి నయమైంది కదా! మిగతా తొమ్మిది మంది ఏరి? 18 ఈ సమరయుడు తప్ప మరెవ్వరూ దేవుణ్ణి స్తుతించటానికి తిరిగి రాలేదా?” అని అన్నాడు. 19 ఆ తర్వాత అతనితో, “లేచి వెళ్ళు, నీ విశ్వాసమే నీకు నయం చేసింది” అని అన్నాడు.
దేవుని రాజ్యం రావటం
(మత్తయి 24:23-28, 37-41)
20 కొందరు పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని అడిగారు.
యేసు, “దేవుని రాజ్యం అందరికి కనిపించేలా రాదు. 21 ‘ఇదిగో, దేవుని రాజ్యం ఇక్కడ ఉంది; అదిగో అక్కడ ఉంది’ అని ఎవరూ అనరు. ఎందుకంటే దేవుని రాజ్యం మీలో ఉంది!” అని సమాధానం చెప్పాడు.
22 ఆ తర్వాత, తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మీతో ఒక్క రోజన్నా ఉండాలని మీరు తహతహలాడే సమయం వస్తుంది. కాని అలా జరగదు. 23 ప్రజలు, ‘అదిగో అక్కడ ఉన్నాడని’ కాని, లేక ‘ఇదిగో ఇక్కడున్నాడని’ కాని అంటే వాళ్ళ వెంట పరుగెత్తి వెళ్ళకండి.
24 “ఎందుకంటే మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆకాశంలో ఈ చివరినుండి ఆ చివరి దాకా మెరిసే మెరుపులా ఉంటాడు. 25 కాని దానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ తరం వాళ్ళతో తృణీకరింపబడాలి.
26 “నోవహు కాలంలో జరిగిన విధంగా మనుష్యకుమారుని కాలంలో కూడా జరుగుతుంది. 27 నోవహు నావలో ప్రవేశించేదాకా ప్రజలు తింటూ, త్రాగుతూ, వివాహాలు చేస్తూ, వివాహాలు చేసుకొంటూ గడిపారు. అతడు నావలో ప్రవేశించాక వరదలు రాగా మిగిలిన వాళ్ళందరూ నాశనమయ్యారు.
28 “లోతు కాలంలో కూడా అదేవిధంగా జరిగింది. ప్రజలు తింటూ, త్రాగుతూ, అమ్ముతూ, కొంటూ, పొలాలు సాగుచేస్తూ, ఇళ్ళు కడుతూ జీవించారు. 29 కాని లోతు సొదొమ పట్టణం వదిలి వెళ్ళిన వెంటనే ఆకాశం నుండి మంటలు, గంధకము వర్షంలా కురిసి అందర్ని నాశనం చేసింది. 30 మనుష్యకుమారుణ్ణి దేవుడు వ్యక్తం చేసిన రోజు కూడా ఇదే విధంగా జరుగుతుంది.
31 “ఆ రోజు ఇంటి కప్పు మీదనున్న వాళ్ళు తమ వస్తువులు తెచ్చుకోవటానికి ఇళ్ళలోకి వెళ్ళరాదు. అదే విధంగా పొలాల్లో ఉన్నవాళ్ళు ఏ వస్తువు కోసం ఇంటికి తిరిగి వెళ్ళరాదు. 32 లోతు భార్యను జ్ఞాపకం తెచ్చుకొండి.
33 “తన ప్రాణాన్ని కాపాడు కోవాలనుకొన్నవాడు పోగొట్టుకొంటాడు. ప్రాణం పోగొట్టుకోవటానికి సిద్దంగా ఉన్నవాడు తన ప్రాణం కాపాడుకొంటాడు. 34 ఆ రాత్రి ఒక పడక మీద ఇద్దరు నిద్రిస్తూ ఉంటే ఒకడు వదిలి వేయబడి మరొకడు తీసుకొని వెళ్ళబడతాడు. 35 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒకామె తీసుకు వెళ్ళబడుతుంది, మరొకామె వదిలి వేయబడుతుంది” అని అన్నాడు. 36 [e]
37 “ఇవి ఎక్కడ సంభవిస్తాయి ప్రభూ!” అని వాళ్ళు అడిగారు.
ఆయన, “ఎక్కడ శవముంటే అక్కడ రాబందులుంటాయి” అని సమాధానం చెప్పాడు.
పట్టు వదలని వితంతువు యొక్క ఉపమానం
18 నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలని, నిరుత్సాహం చెందరాదని, బోధించటానికి యేసు తన శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు: 2 “ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే భీతికాని లేకుండెను. 3 అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది. 4 చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు ‘నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు. 5 కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను’ అని తన మనస్సులో అనుకున్నాడు.”
6 ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా! 7 మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా! 8 ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా?” అని అన్నాడు.
పరిసయ్యుడు, పన్నులు సేకరించేవాడు
9 తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు: 10 “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు. 11 పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి. 12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’
13 “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు. 14 దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”
Footnotes
- 9:55 కొన్ని గ్రీకు ప్రతులలో, “అందుకు యేసు, ‘మీరు ఏ ఆత్మకు సంబంధించిన వాళ్ళో మీకు తెలియదు. 56 మనుష్యకుమారుడు మానవుల్ని నాశనం చేయడానికి కాక రక్షించడానికే వచ్చాడు’” అని చేర్చబడింది
- 10:1 డెబ్బది రెండు కొన్ని ప్రతులలో డెబ్బది అని ఉన్నది.
- 10:25 నిత్యజీవం నిత్యజీవం అనగా మరణించిన తర్వాత శాశ్వతంగా దేవుని రాజ్యంలో జీవించుట (అనంత జీవం).
- 14:2 నీరొచ్చిన జలోదర రోగం అని కొన్ని తర్జుమాల్లో ఉంది.
- 17:36 కొన్ని గ్రీకు ప్రతులలో 36వ వచనం చేర్చబడింది: “ఇద్దరు మనుష్యులు పొలంలో ఉంటే ఒకణ్ణి తీసుకువెళ్ళి యింకొకణ్ణి వదిలి వేస్తాడు.”
© 1997 Bible League International